Tagina


రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండే వాడు. అతను తెలివైనవాడేకానీ పరమ అత్యాశాపరుడు. ఓసారి ఆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణనష్టం తప్పినా లోపలున్న విలువైన వస్తువులన్నీ బుగ్గి పాలవుతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం, ‘పూజగదిలో వ్యాపారాని క్కావాల్సిన డబ్బు నాలుగు లక్షలు పెట్టాను…!’ అంటూ తలబాదుకుంటున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య. ‘మీ ఇంట్లోని డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులో నాక్కావాల్సింది నేను తీసుకుని… నాకిష్టమైనది నీకిస్తాను… సరేనా!’ అన్నాడు. రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య చెప్పినట్టే డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి వంద రూపాయలు మాత్రమే ఇచ్చి, మిగతా మూటని భుజాన వేసుకుని వెళ్లబోయాడు. రామనాథం ‘ఇది అన్యాయం…’ అంటూ అటకాయించాడు. కృష్ణయ్య ఎదురుతిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్లింది. ఇద్దరు చెప్పిందీ విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఓ వైపు మూటనీ, మరోవైపు వంద రూపాయల నోటునీ పెట్టమన్నాడు. పెట్టాక ‘కృష్ణయ్యా! ఇందులో నువ్వు కోరుకుంటున్నదీ… నీకు ఇష్టమైనదీ ఈ పెద్ద మూటే కదా!’ అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. ‘నువ్వు నీకు ‘ఇష్టమైనది’ ఇస్తానన్నావు కాబట్టి… ఆ మూటను రామనాథం చేతికివ్వు!’ అని తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం. ‘నాకిష్టమైనది అంటే నాకిష్టమొచ్చినంతే ఇస్తాను అన్నది నా ఉద్దేశం…!’ అన్నాడు కృష్ణయ్య. ‘నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా, మారుమాట్లాడక చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివైనా అత్యాశవల్లే తప్పుదారి పడుతున్నావ్. ఇకనైనా మార్పు తెచ్చుకో!’ అని
మందలించి కేశవరావు వెళ్లిపోయాడు.

Similar Posts