కాశీలో విజయానంద అనే స్వామీజీ ఉండేవారు. పురాణాలు, ఇతిహాసాల్లోని నీతిని బోధిస్తూ ప్రజలకు మంచి మార్గం చూపేవారు. స్వామీజీ ఓసారి చెట్టునీడన సేదతీరు తుండగా ఒక దొంగ ఆయన సంచిని దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతలో అక్కడి వారంతా ‘దొంగా దొంగా’ అని గట్టిగా కేకలు వేయడంతో సంచి వదిలి పారి పోయాడు. స్వామీజీ సంచి పట్టుకొని ఆ దొంగను వెనుకే వేగంగా పరిగెత్తి పట్టుకొన్నారు.
‘నీకు ఈ సంచిలోని వస్తువులు చాలా అవసరంలా ఉన్నాయి. వీటిని మళ్లీ నేను సంపాదించుకోగలను. ఈ సంచి నువ్వు తీసుకో. మనిషి ప్రత్యక్ష దైవం అంటారు. దేవుడికే నా సంచి అవసరం వచ్చిందన్నమాట’ అని అతడి చేతిలో సంచి పెట్టి వెళ్లి పోయారు. స్వామీజీ మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక దొంగ అలాగే ఉండిపోయాడు. అక్కడి వారందరికీ ఆ సంఘటన చాలా వింతగా అనిపించింది.
కొన్ని నెలల తర్వాత స్వామీజీ గంగలో స్నానానికి వెళ్తుండగా ఓ వ్యక్తి స్వామీజీకి ఎదురుగా
వచ్చి నమస్కరించాడు. స్వామీజీ కూడా నమస్కారం చేసి వెళ్లిపోతుండగా…
‘స్వామీ, నన్ను గుర్తుపట్ట లేదా’ అని అడిగాడా వ్యక్తి.” స్వామీజీ అతడివైపు పరీక్షగా చూస్తుండగానే… సంచి పట్టుకు
పోవడానికి ప్రయత్నించిన దొంగగా తనను పరిచయం చేసుకున్నాడు.
‘ఆరోజు మీరు నా వెంటబడి మరీ చేతిలో సంచి పెట్టారు. ఆ సంఘటన నా ఆలోచనల్ని మార్చేసింది. మీ వస్తువులపైనే మీకు ఆశలేకపోతే నేను ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం తప్పనిపించింది. అటువంటి దుర్బుద్ధి నాకు ఎందుకు పుట్టాలని బాధ కలిగింది. ఆరోజు నుంచి దొంగతనాలు చేయడం మానేశాను. కూలి చేసుకుంటూ బతుకుతున్నాను’ అని బదులిచ్చాడా వ్యక్తి. స్వామీజీ ఎంతో సంతోషంగా అతణ్ని ఆశీర్వదించి అక్కణ్నుంచి వెళ్లిపోయారు.

Similar Posts